తీరు మారలేదు..
గతేదాడి జూన్ 14న అర్ధరాత్రి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) గల్వాన్ లోయలో ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలు సృష్టించింది. వారిని నిలువరించేందుకు భారత ఆర్మీ ప్రయత్నించింది. ఈ క్రమంలో తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లు అమరులయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పలు దఫాలుగా దౌత్య, సైనికాధికారుల మధ్య చర్చలు జరిగడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అయినా చైనా తీరు మారలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా కవ్వింపులకు పాల్పడుతుంది. ఇండియన్ ఆర్మీ అదే తరహాలో తిప్పికొడుతుంది. అయితే ఈ నేపథ్యంలో చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత ఆర్మీ మరో అడుగు ముందుకేసింది. ఈసారి చైనా తోకజాడిస్తే బుద్ధిచెప్పేందుకు భారత ఆర్మీ నాన్ లెథాల్ వెపన్స్‌తో పహారా కాయనుంది.
అప్స్ట్రాన్ తో సంప్రదింపులు..
1996, 2005 సంవత్సరాల్లో భారత్-చైనా మధ్య ఒప్పందాల కారణంగా సరిహద్దుల్లో ఇరుదేశాలకు చెందిన సైనికులు కాల్పులకు జరపకూడదు. అందుకే దొంగదెబ్బ తీస్తూ చైనా ఆర్మీ ఇనుపరాడ్లు, ఇనుపముళ్లు ఆయుధాలతో గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి చేశాయి. ఇప్పుడు భారత ఆర్మీ సైతం ప్రాణాపాయం లేని వెపన్స్‌ను తయారు చేయించింది. ఎల్ఏసీలో చైనా సైనికుల్ని నిలువరించేందుకు ప్రాణాంతకం కానీ(నాన్ లెథాల్)వెపన్స్‌ను తయారు చేయమని ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఆపాస్టెరాన్ అనే కంపెనీతో భారత సైన్యం తమ కంపెనీని సంప్రదించినట్లు ఆ కంపెనీ సీటీఓ మోహిత్ కుమార్ తెలిపారు. భద్రతా దళాల సూచనలతో శివుడి చేతిలోని త్రిశూలం ఇన్స్పిరేషన్తో 'సప్పర్ పంచ్' అనే త్రిశుల్, వజ్ర ఆయుధాల్ని తయారు చేసినట్లు మీడియాకు వెల్లడించాడు.
ఈ సందర్భంగా మోహిత్ కుమార్ మాట్లాడుతూ.. తాము చేసిన వెపన్స్‌తో శత్రు సైనికులపై దాడి చేయడం, వారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పంక్చర్ చేయడానికి వజ్రాను ఉపయోగించవచ్చన్నారు. గ్లౌజ్ తొడుక్కొని దాడిచేస్తే చైనా సైనికులు మూర్ఛపోతారని, త్రిశుల్ను టచ్ చేస్తే డ్రాగన్ సైనికులు గిలగిలా కొట్టుకుంటారని అన్నారు. అంతేకాదు వీటిని వింటర్ సీజన్లో రక్షణకోసం గ్లౌజ్లా ధరించవచ్చని, కరెంట్ పాస్ చేసి దాడి చేయవచ్చని అన్నారు. ఈ ఆయుధాలు ప్రాణాంతకం, తీవ్రమైన గాయాలు చేయలేవని, శత్రు సైనికుల్ని తాత్కాలికంగా నిలువరిస్తాయని అన్నారు.
అదే సమయంలో ఏ భారత భద్రతా దళాలు ఈ ఆయుధాల్ని తయారు చేయమన్నాయి అని అడిగినప్పుడు కుమార్ సమాధానం ఇవ్వలేదు. ప్రైవేట్ వ్యక్తులకు, సాధారణ ప్రజలకు విక్రయించమని చెప్పారు. అయితే ఈ వెపన్స్‌ను దళాల కోసం కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం లేదా, త్రివిధ దళాల ప్రతినిధుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.