తిరుపతి సమీపంలోని రామచంద్రాపురం వద్ద ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, దీనికి సంబంధించి ఒకరిని టాస్క్ ఫోర్సు అరెస్టు చేసింది. టాస్క్ ఫోర్సు ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీదర్ పర్యవేక్షణలో రిజర్వు ఇనస్పెక్టర్ చిరంజీవి టీమ్ రామచంద్రాపురం మండలం ముప్పాల మాలపల్లి సమీపంలోని నిషేధిత అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. అక్కడు ఇద్దరు వ్యక్తులు ఉండటంతో వారిని సమీపించడంతో, వారు పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే అందులో ఒకరిని పట్టుకోగలిగారు. అతనిని వడమాలపేటకు చెందిన వి.షణ్ముగం (38)గా గుర్తించారు.
ఆ ప్రాంతంలో దాచి ఉంచిన 6ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుకున్న వ్యక్తి ద్వారా లభించిన సమాచారం మేరకు బైరాగిపట్టెడకు చెందిన అశోక్ కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు రూ.20లక్షలు ఉండవచ్చునని తెలిపారు.