పౌర సమాచార అధికారులు సమాచార హక్కు చట్టాన్ని నిజస్ఫూర్తితో అమలు చేయాలని రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీ కె. చెన్నారెడ్డి గారు పిలుపునిచ్చారు. సమాచార హక్కు చట్టం (ఆర్.టి.ఐ) వారోత్సవాలలో భాగంగా బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జరిగిన వర్క్ షాప్ లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార వ్యవస్థ పనితీరులో పారదర్శకత ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి నెలా మూడవ శుక్రవారాన్ని “సమాచార హక్కు దినం"గా ప్రకటించిందని చెప్పారు. సమాచారం కోసం దరఖాస్తు అందిన తరువాత 30 రోజుల వరకూ వేచి చూడకుండా సాధ్యమైనంత త్వరగా సమాచారాన్ని అర్జీదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ దిశగా వివిధ శాఖలు తీసుకుంటున్న చర్యలను, దరఖాస్తులను పెండింగ్ పెడుతున్న తీరును పరిశీలించి సత్వర పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఒక పర్యవేక్షణ కమిటీ ఉంటే బాగుంటుందని ఆయన సూచించారు. తాము కూడా వచ్చే నెల నుంచి ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ప్రత్యేక పరిష్కార కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు.
కలెక్టరు శ్రీ ఏ.ఎస్. దినేష్ కుమార్ ఐఏయస్ గారు మాట్లాడుతూ ఆర్.టి.ఐ. దరఖాస్తులను పరిష్కరిస్తున్న తీరును పరిశీలించడం కోసం జిల్లాలో ఇప్పటికే ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసామని చెప్పారు. అప్పీలుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఆర్జీదారులకు సకాలంలో సమగ్ర సమాచారం ఇచ్చేలా ఈ కమిటీ ప్రతి నెలా మూడో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ శాఖలలో ఆర్.టి.ఐ. అర్జీలు పరిష్కారమవుతున్న తీరును ఆయా శాఖల ఉన్నతాధికారులు నిరంతరం పరిశీలిస్తూ ఉండాలని కలెక్టరు ఆదేశించారు.
ఎస్.పి. శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ అధికార వ్యవస్థలో జవాబుదారీతనం ఉండేలా ఈ చట్ట రూపకల్పన జరిగిందన్నారు. పోలీసు శాఖలో ప్రతి స్థాయిలో దీని స్ఫూర్తి దెబ్బతినకుండా అమలయ్యేలా చూస్తామని చెప్పారు. ఆర్.టి.ఐ. చట్టం అమలుపై అవగాహన కల్పించేలా సమాచార కమిషన్ ప్రచురించిన పుస్తకాలను ఈ సందర్భంగా వీరు ఆవిష్కరించి వివిధ శాఖల ఉన్నతాధికారులకు అందించారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ. బి. చిన ఓబులేసు, మార్కాపురం సబ్ కలెక్టరు సేతు మాధవన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.