* హిందీ మాధ్యమంలో విద్యాబోధనపై అమిత్‌షా కమిటీ నివేదిక దుర్మార్గం
* హక్కులను అణచివేసేలా కేంద్రం తీరు ప్రధానికి మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ
* ప్రాంతీయ భాషల్లో అర్హత, ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్
రాజ్యాంగంలోని 345వ అధికరణం ప్రకారం అధికారిక భాష రాష్ర్టాల విషయం. హిందీని బలవంతంగా రుద్దడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉండటం బ్రిటిష్ కాలంనాటి వలసవాద, ఆధిపత్య భావజాలానికి నిదర్శనం.
– కేటీఆర్
హైదరాబాద్ : దేశ ప్రజలపై బలవంతంగా హిందీభాషను రుద్దాలని అనుకోవడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పురపాలకశాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తప్పుపట్టారు. ఇది ప్రజల హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. ప్రపంచస్థాయి ప్రమాణాలున్న విద్యాసంస్థల్లో హిందీ మాధ్యమంలోనే బోధన ఉండాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సారథ్యంలోని పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్ర ఉద్యోగాల అర్హత పరీక్షలను కూడా హిందీ భాషలోనే నిర్వహించడాన్నీ ఆక్షేపించారు. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి మోదీకి ఒక లేఖ రాశారు.
ఉద్యోగ పరీక్షల్లో కూడానా..?
కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వాటి అనుబంధ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించిన నియామకాల పరీక్షలు హిందీ, ఆంగ్ల భాషల్లోనే నిర్వహిస్తున్న మోదీ సర్కారు తీరుపైనా కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. పౌరులందరూ సమాన అవకాశాలు పొంద డం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఈ హక్కును అణచివేస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర ఉద్యోగ పరీక్షలన్నింటినీ ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని డిమాండ్‌చేశారు. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రాంతీయ భాషల్లోనే ఉన్నత విద్య ఉంటుందని చెప్పుకొంటున్న కేంద్రప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో ఇంగ్లిష్, హిందీకి ప్రాధాన్యమిచ్చి తన డొల్లతనాన్ని బయటపెట్టుకొన్నదన్నారు. స్టాఫ్ సెలెక్షన్ కమిటీ తాజా నోటిఫికేషన్లలో ప్రాంతీయ భాషల్లో చదువుకొన్న విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. ఇది కేవలం 12 రాష్ర్టాలకు సంబంధించిన సమస్య కాదని.. మాతృభాషలో చదువుకొన్న కోట్ల మంది తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకొని అన్ని ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తెలుగులో చదువుకొన్న యువకుల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.
ప్రాంతీయ భాషల్లోనే సివిల్స్ నిర్వహించాలి
ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్ల యువకులకు కేంద్ర ఉద్యోగ పరీక్షలు ఆ భాషల్లోనూ నిర్వహించాలని 2020 నవంబర్ 18న సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఖాళీగా ఉన్న లక్షల కేంద్ర ఉద్యోగాలకు ఇప్పటిదాకా నోటిఫికేషన్లే వేయని మోదీ సర్కారు ఇప్పుడు భర్తీ చేస్తున్న కొద్దో గొప్పో ఉద్యోగాల విషయంలో మాతృభాషలో చదువుకొన్న కోట్ల మంది ఉపాధి అవకాశాలను దెబ్బతీసున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజ్యాంగంలోని 345వ అధికరణం ప్రకారం అధికారిక భాష అనేది రాష్ర్టాలకు సంబంధించిన విషయమని, హిందీని బలవంతంగా రుద్దాలనుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టంచేశారు. ఢిల్లీలో ఉండే కొందరు బ్యూరోక్రాట్లు, నేతలు ఇంకా బ్రిటిష్ కాలంనాటి వలసవాద, ఆధిపత్య భావజాలాన్ని మోస్తున్నారనడానికి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉండటమే నిదర్శనమన్నారు. మాతృభాషల్లో చదువుకొని ఆయా అంశాలపై మంచి పట్టున్న అభ్యర్థులు నష్టపోతున్నారని చెప్పారు సివిల్స్ ప్రిలిమ్స్‌ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించడంతోపాటు మెయిన్స్, ముఖాముఖిలో అనువాదకుల అవసరం లేకుండా ఆయా భాషలు తెలిసిన అధికారులతోనే బోర్డులు ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు.
అర్హత పరీక్షలన్నీ ప్రాంతీయభాషల్లోనే…
యూపీఎస్సీ నిర్వహించే ఇంజినీరింగ్, ఎకనమిక్ సర్వీస్ పరీక్షలతోపాటు.. గిరిజనులు, గ్రామీణులతో మమేకమై విధులు నిర్వర్తించే ఫారెస్ట్ సర్వీస్ అధికారుల ఎంపికలోనూ ఇంగ్లిష్‌కు పెద్దపీట వేయడం అన్యాయమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో 20కి పైగా ఉద్యోగ నియామక సంస్థలున్నాయని.. 2017-2020 మధ్య యూపీఎస్సీ పరీక్షలకు దాదాపు 90 లక్షల మంది, ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు కోటీ ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నారని, ప్రాంతీయభాషల్లో పరీక్షలు పెడితే మరింత ఎక్కువమంది పోటీపడేవారని చెప్పారు. జాతీయస్థాయి ఉద్యోగ నియామకాల్లో అన్ని రాష్ర్టాల అభ్యర్థులకు సమాన, న్యాయమైన అవకాశాలు దక్కాలంటే అర్హత పరీక్షలన్నీ హిందీ, ఇంగ్లిష్‌తోపాటు ఆయా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని డిమాండ్‌చేశారు.2014కు ముందు వరకు ప్రాంతీయ భాషల్లో బ్యాంకు నియామక పరీక్ష రాసే అవకాశం ఉండేదని, ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీల్లోనే నిర్వహిస్తుండటంతో స్థానికులకు ఉద్యోగాలు దకడం లేదన్నారు. బ్యాంకు పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ రెండేండ్ల క్రితం ఇచ్చిన హామీ ‘జుమ్లా’ తప్ప మరొకటి కాదని కేటీఆర్ విమర్శించారు. చాలా రాష్ర్టాల్లో విద్యార్థులు మాతృభాషలోనే విద్యాభ్యాసం చేస్తున్నారని, హిందీ, ఇంగ్లిష్ భాషలను కేవలం ఒక అంశంగా చదువుతున్నారని కేటీఆర్ చెప్పారు. తాము పొందిన జ్ఞానం, భావనలను ఇతర భాషల్లోకి అనువదించుకొని ఆ పదజాలాన్ని అవగాహన చేసుకొని పోటీలో ఉద్యోగం సాధించడం అంత తేలిక కాదని పేర్కొన్నారు. వివిధ అంశాల పట్ల మాతృభాషలో పరిజ్ఞానం, అవగాహన ఉండి కూడా అవకాశాలను అందుకోకపోవడానికి ఇదే ముఖ్యకారణమని చెప్పారు. ఒక ఉద్యోగి ఇతర రాష్ర్టాల్లో ఉద్యోగం చేయవలసిన సందర్భాలలో మాత్రమే హిందీ, ఇంగ్లిష్ అవసరమని. స్వరాష్ట్రంలో చేసినప్పుడు అవసరం లేదని పేర్కొన్నారు. ఆయా భాషల్లో ప్రాథమిక పరిజ్ఞానం పరిశీలించడానికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సివిల్స్, రైల్వే, పోస్టల్, రక్షణ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌తో పాటు నెట్, జనరల్ స్టడీస్, కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలలో నిర్వహించే పరీక్షలను ప్రాంతీయ భాషలలో రాసేందుకు అవకాశం కల్పించే విషయమై తక్షణం ఒక నిపుణుల కమిటీ నియమించాలని ప్రధాని మోదీని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
దేశానికంతటికీ అంటగడుతరా?
ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రపంచస్థాయి ప్రమాణాలు ఉన్న విద్యాసంస్థలో హిందీ మాధ్యమంలోనే విద్యాబోధన ఉండాలని అమిత్‌షా కమిటీ నివేదిక సమర్పించిందని.. కేవలం 40% ప్రజలు మాట్లాడే హిందీని బలవంతంగా దేశం మొత్తానికి అంటగట్టడం దుర్మార్గమని మంత్రి కేటీఆర్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఏ భాషకూ అధికార హోదా ఇవ్వలేదని, రాజభాష అని హిందీకి పట్టం కట్టలేదని గుర్తుచేశారు. 22 భాషలను అధికారభాషలుగా మాత్రమే రాజ్యాంగం గుర్తించిందన్న కేటీఆర్.. మోదీ సర్కారు చర్యలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేశారు. ప్రస్తుత ప్రపంచీకరణ కాలంలో మిగతా ప్రపంచంతో మనం కనెక్ట్, కమ్యూనికేట్ అవ్వడం.. ఇంగ్లిష్‌తో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం హిందీకి అనవసర ప్రాధాన్యాన్నిస్తూ దేశాన్ని తిరోగమనంలోకి వేగంగా నెట్టేస్తున్నదని విమర్శించారు. అన్నిభాషలకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలన్న భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని.. హిందీని రుద్దే ప్రయత్నాలను మానుకోవాలని కోరారు. అమిత్‌షా కమిటీ నివేదికన పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు.