Kashmir తూటాలు దూసుకెళ్లి రక్తమోడుతున్నా ఉగ్రవాదులను వదిలిపెట్టని జాగిలం

S7 News
0

 


దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక సైనికులు నిరంతరం సరిహద్దుల్లో కాపాలా కాస్తున్నారు. మాతృదేశం కోసం వారికి ఉన్న నిబద్దతే ప్రజలను ప్రశాంతంగా ఉండేలా చేస్తోంది. అయితే, కేవలం సైనికులే కాదు జాగిలాలు కూడా దేశం కోసం తామ ప్రాణాలు కూడా లెక్కచేయమని నిరూపించే ఘటన ఇది. రెండు రోజుల కింద కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. దీని వెనుక ఓ జాగిలం సాహసం ఉంది.


ప్రధానాంశాలు:

  • అనంత్‌నాగ్‌లో రెండు రోజుల కింద ఎన్‌కౌంటర్
  • ముష్కరులిపై జాగిలాన్ని వదిలిన సైనికులు
  • కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జూమ్ జాగిలం.
దేశ రక్షణ విషయంలో ప్రాణాలు పోతున్నా సైనికులు వెనకడుగు వేయరు. తూటా గాయాలతో రక్తమోడుతున్నా శత్రువులను తుదముట్టించే వరకూ విశ్రమించరు. అలాంటి సైనికుల శిక్షణలో రాటుదేలిన ఓ జాగిలం (Army Dog)కూడా అదే తరహా నిబద్ధతను కనబరిచి ఔరా అనిపించింది. ఉగ్రవాదులను గుర్తించే క్రమంలో తూటాలు శరీరంలోకి దూసుకెళ్లినా వెనక్కి తగ్గలేదు. దాని తెగువతో ఇద్దరు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. ఈ ఘటన జమ్మూ కశ్మీర్‌లోని (Jammu and Kashmir) అనంత్‌నాగ్‌ జిల్లా తంగపావా ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది.
తంగపావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తొయిబా (Lashkar e Taiba) ఉగ్రవాదులున్నారనే విశ్వసనీయ వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఆర్మీకి చెందిన చీనార్ కార్ప్స్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా అక్కడకు చేరుకుని నిర్బంధన తనిఖీలు చేపట్టాయి. ఉగ్రవాదులను గుర్తించేందుకు జూమ్‌ (Zoom Dog) అనే జాగిలాన్ని రంగంలోకి దిగారు. ముష్కరులు ఓ ఇంట్లో నక్కి ఉండగా వారిని కచ్చితంగా గుర్తించిన జూమ్.. అక్కడకు చేరుకుంది. ఉగ్రవాదులపై సింహంలా దూకి దాడిచేసింది. ఈ క్రమంలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో రెండు బుల్లెట్లు దాని శరీరంలోకి దూసుకెళ్లాయి. అయినా ఆ జాగిలం మాత్రం పోరాటాన్ని ఆపలేదు.

ఇంతలో అక్కడికి చేరుకున్న సైన్యం... ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఎన్‌కౌంటర్‌‌లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులను గుర్తించి, మట్టుబెట్టడంలో జూమ్‌కు కఠిన శిక్షణ ఇచ్చామని, ఇంతకుముందు కూడా చాలా ఆపరేషన్లలో ఎంతో నిబద్ధతతో వ్యవహరించిందని అధికారులు పేర్కొన్నారు. రెండు బుల్లెట్లు తగిలి తీవ్ర గాయాలైనా అది మాత్రం వెనకడుగు వేయలేదని తెలిపారు. గాయపడిన జాగిలాన్ని ఆర్మీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోందని వివరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు సైనికులు గాయపడ్డారు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top