ముంబై లోకల్ ట్రైన్‌లో (Mumbai local train) మళ్లీ మహిళలు కొట్టుకున్నారు. దేని కోసమో తెలియదు కానీ.. రద్దీగా ఉన్న బోగీలో ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. అరుస్తూ.. వాగ్వాదం చేసుకున్నారు. కొంతమంది ప్రయాణికులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. మరికొందరు మాత్రం చూస్తుండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా కొన్ని రోజుల ముందే లోకల్ ట్రైన్‌లో మహిళలు బీభత్సంగా కొట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రధానాంశాలు:
- ముంబై లోకల్ ట్రైన్‌లో మళ్లీ గొడవ
- తిరగబడి కొట్టుకున్న మహిళలు
- సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
Mumbai local train: లోకల్ ట్రైన్స్‌లో ముష్టి యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఓ సీటు కోసం మహిళలు సిగపట్లు పట్టారు. ఘోరంగా కొట్టుకున్నారు. అది ఇంకా మరువక ముందే... మరో వీడియో బయటకొచ్చింది. అందులోనూ మహిళలు.. ఒకరిపై మరొకరు తిరగబడి కొట్టుకున్నారు. రద్దీగా ఉండే ముంబై లోకల్ ట్రైన్‌లో ఇది జరిగింది. మహిళల కోచ్‌లో వసాయ్ దగ్గర ఈ గొడవ జరిగినట్టు తెలుస్తుంది.
విరార్-దాదర్ ఫాస్ట్ లోకల్ ట్రైన్‌లోని మహిళల బోగీలో ఇద్దరు మహిళలు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్తా గొడవగా మారింది. దాంతో ఒకరిపై మరొకరు అరుచుకున్నారు. ఇంకాస్తా ముందుకు వెళ్లి కొట్టుకున్నారు. ఒకరి జుట్టు మరొకరు లాగి మరీ కొట్టుకున్నారు. అయితే అక్కడున్న ప్రయాణికులు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. మరికొందరు మాత్రం ఆ ఘర్షణను నిలబడి చూస్తుండిపోయారు. అయితే ఆ మహిళలు ఎందుకు అంత తీవ్రస్థాయిలో గొడవపడ్డారో కారణం తెలియ రాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
కాగా కొన్ని రోజుల క్రితం థానే-పన్వేల్ లోకల్ రైల్లో మహిళల మధ్య జరిగిన ఓ గొడవ వైరల్ అయింది. ట్రైన్‌లో ఓ సీటు విషయంలో కొంతమంది మహిళల మధ్య భారీ స్థాయిలో గొడవ జరిగింది. ఒకరినొకరు తోసుకుంటూ గొడవ పడ్డారు. సీటు విషయంలో ముగ్గురు మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగింది. కొద్ది సేపటికే ఆ వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. దాంతో పెద్ద ఎత్తున ఘర్షణకు దారి తీసింది. ఆ గొడవను తగ్గించేందుకు, ఆ మహిళలను ఆపేందుకు శారద ఉగ్లే అనే మహిళా కానిస్టేబుల్ ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. దాంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.