కర్బనం పుష్కలంగా ఉన్న గ్రహశకలాల నుంచి ఉల్కల రూపంలో భూమ్మీదకు జీవరాశి వచ్చిందని ఇటీవల పరిశోధనల్లో వెల్లడయ్యింది. సూర్యుడు ఏర్పడే క్రమంలో విశ్వంలో జరిగిన ఫొటోకెమికల్ చర్యల వల్ల న్యూక్లియోబేస్‌లు ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. తర్వాత సౌర కుటుంబం పరిణామ క్రమంలో గ్రహ శకలాల్లోకి చేరి ఉంటాయని విశ్లేషిస్తున్నారు. అయితే, భూమికి గ్రహశకలాలతో ముప్పు పొంచి ఉంది. ఈ ముప్పు నుంచి తప్పించడానికి నాసా గత నెల ఓ ప్రయోగం నిర్వహించింది.
ప్రధానాంశాలు:
- గ్రహ శకలాల ముప్పు తప్పించే వినూత్న మిషన్
- గత నెలలో నాసా చేపట్టిన డార్ట్ ప్రయోగం సక్సెస్
- అంతరిక్ష పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కీలక మైలురాయి.
భూమివైపు దూసుకొచ్చే గ్రహశకలాలను (Asteroid) మార్గమధ్యలోనే ఢీకొట్టి ప్రమాదాన్ని నివారించడమే లక్ష్యంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ‘డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (DART Mission)’ ప్రయోగం విజయవంతమైంది. సెప్టెంబరు 26న డార్ట్ వ్యోమనౌక ఢీకొట్టడంతో డైమార్ఫస్ అనే ఆస్ట్రాయిడ్ తన కక్ష్యను మార్చుకుంది. ఈ ప్రయోగం కారణంగా డైమార్ఫస్ పరిభ్రమణ కక్ష్యలో దాదాపు 32 నిమిషాల మార్పు చోటుచేసుకున్నట్లు నాసా మంగళవారం ప్రకటించింది. భవిష్యత్తులో గ్రహశకలాల వల్ల భూమికి ఎలాంటి ముప్పు ముంచుకొచ్చినా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యాలను సముపార్జించుకోవడంలో ఇది కీలక ముందడుగని నాసా తెలిపింది.
ఆస్టరాయిడ్లు, ఉల్కలు ఎప్పటికైనా భూమికి ప్రమాదకరమైనవే. అందుకే అంతరిక్షంలో వాటిని స్పేస్ క్రాఫ్ట్‌ల ద్వారా ఢీకొట్టే ఆలోచనతో నాసా ఈ వినూత్న మిషన్ చేపట్టింది. వాస్తవానికి ఆగస్టు 29న జరగాల్సిన డార్ట్ మిషన్ (DART Mission) రెండో ప్రయోగం ఇంజిన్ సాంకేతిక సమస్యలతో వాయిదా వేసింది. సెప్టెంబరులో ఫ్లోరిడాలో కేప్ కెనర్వాల్‌లోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం (Kennady Space Centre) నుంచి డార్ట్‌ను ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమై సెప్టెంబర్ 26న ఉదయం 4:44 గంటల సమయంలో గ్రహశకలం డైమోర్ఫోస్‌ను ఢీకొట్టింది.
నాసా ప్రకారం.. ఆస్టరాయిడ్‌లు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల కిందట సౌర వ్యవస్థ ఏర్పడగా మిగిలిపోయిన రాతి శకలాలు. వీటిని భూమికి సమీపంలో ఉన్న వస్తువుగా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. మన భూగోళం నుంచి వీటి దూరం 93 మిలియన్ మైళ్లు. ఇది భూమి-సూర్యుడికి మధ్య దూరం కంటే 1.3 రెట్లు తక్కువ.