T20 World Cup 2022 ముంగిట క్రికెట్‌లోకి కొత్త రూల్స్.. ఐసీసీ హెచ్చరిక
S7 News
October 12, 2022
0
New cricket rules ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కానీ ఇప్పటికీ కొన్ని రూల్స్‌పై జట్లకి పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదు. దాంతో రూల్స్‌కి లోబడి రనౌట్ చేసిన అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ కొంత మంది క్రికెటర్లు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్ 2022 ముంగిట మరోసారి రూల్స్‌ని మననం చేసుకోవాలని ఐసీసీ సూచించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఈ నెల 16 నుంచి వరల్డ్‌కప్ ప్రారంభంకానుంది.
క్రికెట్ కొత్త రూల్స్ (Pic Source: Twitter)
ప్రధానాంశాలు:
టీ20 వరల్డ్‌కప్ ముంగిట టీమ్స్‌కి ఐసీసీ హెచ్చరిక
కొత్త రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలని సూచన
ఇటీవల వివాదాస్పదంగా మారిన మాన్కడింగ్ ఉదంతం
రూల్స్‌ని మరోసారి గుర్తు చేసిన ఐసీసీ
ఆస్ట్రేలియా గడ్డపై ఈ నెల 16 నుంచి టీ20 వరల్డ్‌కప్ 2022 (T20 World Cup 2022) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ ముంగిట అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అన్ని జట్లకీ ఓ చిన్నపాటి హెచ్చరికని జారీ చేసింది. క్రికెట్ ప్లేయింగ్ కండీషన్స్‌లో ఇటీవల చిన్న మార్పులు జరిగినట్లు గుర్తు చేసిన ఐసీసీ.. మ్యాచ్‌లు ఆడే సమయంలో జట్లు ఆ రూల్స్‌పై ఓ కన్నేసి ఉంచుకోవాలని సూచించింది. ఐసీసీ (ICC) ఇలా సూచించడానికి కారణం ఇటీవల భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ చేసిన మాన్కడింగ్‌పై వివాదం చెలరేగడమే. రూల్స్‌కి అనుగుణంగానే ఇంగ్లాండ్ బ్యాటర్‌ని దీప్తి మాన్కడింగ్ చేసినా.. ఆ దేశ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే.. దీప్తికి ఐసీసీతో పాటు భారత క్రికెటర్లు కూడా అండగా నిలిచారు.
అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్‌లో ప్రధానమైనవి ఇవే.
1. రనౌట్ (మాన్కడింగ్): బౌలర్ బంతిని విసరక ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని బ్యాటర్ క్రీజుని వదిలితే? ఆ బ్యాటర్‌ని రనౌట్ చేసేందుకు బౌలర్‌కి అధికారం ఉంది. ఇదేమీ రూల్స్, క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కాదని ఐసీసీ మరోసారి స్పష్టం చేసింది. గతంలో ఇలా ఔట్ చేయడాన్ని మాన్కడింగ్ అనేవారు. కానీ ఇకపై దాన్ని ‘రనౌట్’గా పరిగణిస్తారు.
2. స్లో ఓవర్ రేట్:బౌలింగ్ టీమ్ కేటాయించిన సమయంలోపు నిర్ణీత ఓవర్లని పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ బౌలర్లతో చర్చలు, ఫీల్డింగ్ కూర్పు కోసం కెప్టెన్లు ఇటీవల ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. దాంతో మ్యాచ్ సమయం వృథా అయిపోయింది. ఈ నేపథ్యంలో స్లో ఓవర్ రేట్ తప్పిదాల కింద జరిమానాలు ఎక్కువైపోయాయి. కానీ జట్లు మారడం లేదు. దాంతో కొత్త రూల్‌ని తీసుకొచ్చారు. గతంలో మ్యాచ్ ముగిసిన తర్వాత స్లో ఓవర్ రేట్ తప్పిదాన్ని గుర్తించి శిక్ష వేసేవారు. కానీ ఇప్పుడు మ్యాచ్ చివరి ఓవర్ టైమ్‌కే టీమ్ స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడినట్లు తేలితే? 30 యార్డ్ సర్కిల్ వెలుపల లాస్ట్ ఓవర్‌లో ఒక ఫీల్డర్‌ని తగ్గించనున్నారు. ఇది ఫీల్డింగ్ టీమ్‌కి చివర్లో పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
3. కొత్త బ్యాటర్‌కే స్ట్రైక్:మ్యాచ్ ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా కొత్తగా క్రీజులోకి వచ్చే బ్యాటర్ స్ట్రైక్ తీసుకోవాలి. ఫీల్డర్ క్యాచ్ పట్టక ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని బ్యాటర్.. స్ట్రైక్ ఎండ్ బ్యాటర్‌ని పిచ్ మధ్యలో క్రాస్ చేసినా సరే.. కొత్తగా వచ్చే బ్యాటరే స్ట్రైక్ తీసుకోవాల్సి ఉంటుంది. 4. ఫీల్డర్ అసందర్భ కదలికకి జరిమానా: బౌలర్ బంతిని విసిరేందుకు రన్నప్‌తో వస్తున్నప్పుడు మైదానంలో ఏ ఫీల్డర్ కూడా అసందర్భంగా కదలకూడదు. అలా కదిలినట్లు తేలితే ఫీల్డింగ్ టీమ్‌కి ఐదు పరుగుల పెనాల్లీ విధించి.. ఆ పరుగుల్ని బ్యాటింగ్ టీమ్ స్కోరు బోర్డుకి కలుపుతారు. అయితే ఇక్కడ ఒక వెసులబాటు ఉంది. బ్యాటర్ ఏ వైపునైనా షాట్ ఆడేందుకు బంతి రాక ముందే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తే? దానికి తగినట్లుగా ఫీల్డర్ కదలవచ్చు. ఉదాహరణకి స్పిన్నర్ బౌలింగ్‌లో బ్యాటర్ స్వీప్ ఆడేందుకు ఆఫ్ స్టంప్ లైన్‌పై వెళితే? అప్పుడు ఫైన్ లెగ్‌లోని ఫీల్డర్‌కి కదిలే వెసులబాటు ఉంటుంది. అంతేతప్ప అసందర్భంగా కదిలితే మాత్రం పెనాల్టీ తప్పదు.