చిత్తూరు: కొంపముంచిన వాట్సాప్ కాల్.. రూ.21 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి, చిన్న తప్పుతో!

S7 News
0

చిత్తూరు: కొంపముంచిన వాట్సాప్ కాల్.. రూ.21 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి, చిన్న తప్పుతో!

చిత్తూరు జిల్లాలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అమాయకంగా డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈజీగా డబ్బులు సంపాదించొచ్చిన చెబితే నమ్మి నిండా మునిగాడు. బంగారుపాళ్యం మండలం కోలావూరుకు చెందిన ఓ యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ కావడంతో ఊరిలో ఉన్నాడు. ఇంతలో ఓ వెబ్‌సైట్‌ ద్వారా మొదట వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. ఈజీ మనీ పేరుతో ఆన్‌లైన్‌ ద్వారా వస్తువులు ఆర్డర్‌ చేస్తే ఎక్కువ కమీషన్‌ ఇస్తామని నమ్మించారు. అలాగే ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా కూడా సంపాదించొచ్చని చెప్పారు. అతడు కూడా నిజమని భావించి.. ముందు రూ.500తో మొదలుపెట్టి రూ.15 వేల వరకు ఆన్‌లైన్‌ ద్వారా వస్తువుల్ని ఆర్డర్‌ చేశాడు. ఓ దఫా రూ.3 వేలకు రూ.15 వేలు వచ్చింది.


అతడిని నమ్మించేందుకు ముందు కొంత మేర కమీషన్‌ రూపంలో అకౌంట్‌‌లో డబ్బులు జమ చేశారు. అలా విడతల వారీగా వారికి రూ.21 లక్షల వరకు జమ చేశాడు. ఇంతలో అతడి అకౌంట్‌ సీజ్‌ కావడంతో అవాక్కాయ్యాడు. అప్పుడు కానీ తాను మోసపోయానని తెలియలేదు. ఏప్రిల్‌ 4 నుంచి 21 వరకు ఈ తతంగం మొత్తం జరిగింది. వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్, సైబర్ మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే, పదే చెబుతున్నా కొందరు మోసపోతున్నారు. ఆన్‌లైన్ గేమ్స్, ఆఫర్లు, డిసౌంట్ల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. అంతేకాదు రెండు, మూడు రోజులుగా తెలియని నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. ఈ విషయంలో అలర్ట్‌గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ విషయంలో జాగ్రత్త అవసరం అంటున్నారు.


మరోవైపు చిత్తూరు జిల్లా పెనుమూరులో ఉద్యోగాల పేరుతో మోసం బయటపడింది. సామిరెడ్డిపల్లెకు చెందిన యువకుడు ఉద్యోగాల పేరుతో యువకుల్ని నమ్మించాడు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో 20 మంది నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ.25 వేల- రూ.75 వేల వరకు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని చాలా రోజులైనా ఉద్యోగాలు ఇవ్వలేదని బాధితులు అతడ్ని నిలదీశారు. దీంతో అతడు వారిపట్ల దురుసుగా ప్రవర్తించాడు. చంపుతానంటూ బెదిరించాడు.


దీంతో బాధితులు అతడిపై తిరగబడినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల వారు ఘర్షణకు దిగారు. అయితే ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే ఉద్యోగాల పేరుతో మోసం చేసిన యువకుడి తల్లి స్థానిక ప్రజాప్రతినిధి అని తెలుస్తోంది. ఈ ఉద్యోగాల వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)