హైదరాబాద్ ఉగ్రకుట్ర కేసులో విస్తుపోయే విషయాలు

S7 News
0

హైదరాబాద్ ఉగ్రకుట్ర కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో విధ్వంసానికి కుట్ర పన్నిన ఉగ్రవాద సంస్థ హిజబ్ ఉత్ తెహ్రిర్ ఉచ్చులో అనేక మంది చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లో సలీం, రెహ్మాన్, అబ్బాస్, హమీద్, జునైద్, సల్మాన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. నిందితులంతా ఏడాదిన్నరగా ఇక్కడ రాడికల్ ఇస్లామ్ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. హిజబ్ ఉత్ తెహ్రిర్ ఆధ్వర్యంలో తరుచూ బయాన్ పేరుతో సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు రాష్ట్రంలోని జిల్లాల నుంచి పలువురు హాజరైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఉగ్ర కుట్ర కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో హైదరాబాద్లో అరెస్టయిన వారు ఆరుగురు ఉన్నారు. వీరి పుట్టు పూర్వోత్తరాలపై తెలంగాణ పోలీసులు దృష్టిసారించారు. అరెస్టయిన ఆరుగురిలో ముగ్గురు గతంలో భోపాల్లోఉండేవారని.. నాలుగేళ్ల క్రితమే నగరానికి వచ్చి వేర్వేరు చోట్ల నివాసం ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురు గతంలో మత మార్పిడి ద్వారా ముస్లింలుగా మారి.. ఇస్లాం బోధనలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ముఠాలో కీలకంగా వ్యవహరించిన మహ్మద్ సలీం మతమార్పిడి చేసుకున్నట్లు గుర్తించారు. సలీం అసలు పేరు సౌరభ్ రాజ్. ఇతని భార్య కూడా హిందూ మతం నుంచి ముస్లిం మతానికి మారినట్లు గుర్తించారు. ఆరేళ్ల క్రితం భోపాల్ నుంచి హైదరాబాద్కు వచ్చిన సలీం.. ఓ ప్రజాప్రతినిధికి చెందిన మెడికల్ కాలేజీలో ఉద్యోగం సంపాదించినట్లు తెలుస్తోంది. దీనికి ఓ వ్యాపార వేత్త సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సలీం హైదరాబాద్ వచ్చిన తర్వాతే.. హిజబ్ ఉత్ తెహ్రిర్ కార్యకలాపాలు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆపరేషన్లో మత మార్పిడి అంశం వెలుగుకి రావడం సంచలనంగా మారింది. నిందితుల్లో ముగ్గురు హిందువులు.. ముస్లిం మతానికి మారినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు.

హైదరాబాద్లో వివిధ ప్రాంతాలలో నివాసం ఉన్న ముఠా సభ్యులు.. ఎవరికీ అనుమానం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. గోల్కొండ, టోలిచౌకి, మల్లేపల్లి, జవహర్నగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాలలో నిందితులు నివాసమున్నారు. తాము ఉంటున్న ఇంటి నెంబర్లతో కాకుండా.. పక్క పక్క ఇళ్లలో ఉంటున్నట్లు ఆధార్ కార్డులను తయారు చేయించుకున్నారు. నిందితుల్లో రోజు వారీ కూలీ పనులు చేసుకునే వ్యక్తి నుంచి.. డెంటిస్ట్ వరకు ఉన్నారు. బయాన్ పేరుతో తరుచూ సమావేశయ్యే వీరంతా.. ఎక్కువగా సలీం ఇంట్లో కలుకునేవారని పోలీసులు గుర్తించారు. ఈ సమావేశాలకు ఎవరెవరు వచ్చేవారు అన్నదానిపై పోలీసులు దృష్టి సారించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ల్యాప్టాప్లలోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. ఉగ్రవాద సంస్థ హిజబ్ ఉత్ తెహ్రిర్లో ఎక్కువగా విద్యావంతులు, ధనవంతులైన వారు సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే వీరు ఎంత మందిని ఉగ్రవాదం వైపు మళ్లించారన్న దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు.

హైదరాబాద్ శివారులోని టూరిస్ట్ స్పాట్ అయిన అనంతగిరి గుట్టలో నిందితులు శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తుపాకులు పేల్చడం, కత్తులు, గొడ్డళ్లతో దాడికి ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 48 గంటలపాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండేందుకు కూడా శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా యూట్యూబ్లో చూసి యువకులు ఫిట్నెస్ పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా హోటళ్లు, గెస్ట్హౌస్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో దాడులకు ప్లాన్ చేసి... ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని స్కెచ్ వేశారని పోలీసులు వెల్లడించారు. మాల్స్పై దాడి చేసి తమ ఆధీనంలో ఉంచుకునేందుకు భారీ కుట్ర చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు యాసిర్ నేతృత్వంలో ప్రత్యేకంగా టీమ్ రెడీ అయిందన్నారు. ఇప్పటివరకు యాసిర్ 50 మందిని చేర్చుకున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

హిజబ్ ఉత్ తెహ్రిర్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగిన నిందితులు.. ఇస్లామిక్ రాజ్యస్థాపన లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశాలను టార్గెట్ చేశారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం 50 దేశాల్లో హెచ్యూటీ కార్యకలాపాలు కొనసాగుతుండగా.. 16 దేశాల్లో ఈ ఉగ్రవాద సంస్థపై నిషేధం ఉంది. హైదరాబాద్లో అరెస్టయిన ఆరుగురు నిందితులను ఏటీఎస్ కస్టడీకి భోపాల్లోని ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. దీంతో ఈ నెల 19 వరకు వీరు పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు. విచారణలో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను హైదరాబాద్కు తీసుకురానున్నారు.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)